Singarayakonda Updates

Singarayakonda is a census town in Prakasam district of the Indian state of Andhra Pradesh.

సింగరాయకొండ ఎమర్జెన్సీ రన్‌వే పై 40 పేజీల సమగ్ర నివేదిక రూపొందించిన సింగరాయకొండ సామాజిక కార్యకర్త సాంబ చెన్నంశెట్టి

సింగరాయకొండ ఎమర్జెన్సీ రన్‌వే పై 40 పేజీల సమగ్ర నివేదిక రూపొందించిన సింగరాయకొండ సామాజిక కార్యకర్త సాంబ చెన్నంశెట్టి


సింగరాయకొండ మండల పరిధిలోని జాతీయ రహదారి-16పై ఉన్న అత్యవసర విమానాల ల్యాండింగ్ సదుపాయం (ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ - ELF) వద్ద వరుస రోడ్డు ప్రమాదాలు, ప్రాణనష్టాలు, ప్రజల ఆందోళనల నేపథ్యంలో సింగరాయకొండకు చెందిన సామాజిక కార్యకర్త, ప్రజా ప్రయోజన వ్యాజ్యదారుడు (Public Interest Petitioner) సాంబ చెన్నంశెట్టి 40 పేజీల సమగ్ర నివేదికను సిద్ధం చేశారు.


2019 నుంచి 2026 జూన్ వరకు అందుబాటులో ఉన్న పత్రికా కథనాలు, ప్రమాద గణాంకాలు, ఫొటోలు, పోలీసు అధికారుల పరిశీలనలు, ప్రజల అభిప్రాయాలు, ప్రమాదాలకు గల కారణాలు, తీసుకోవాల్సిన భద్రతా చర్యలు, అధికారులకు వినతిపత్రాలు తదితర అంశాలతో కూడిన ఈ నివేదికను రూపొందించారు.


ఈ నివేదికలో 92 మంది మృతిచెందినట్లు, 127 మంది గాయపడినట్లు ప్రచురిత గణాంకాల ఆధారంగా ప్రస్తావించబడింది. రన్‌వే ప్రాంతంలో నిరంతర డివైడర్ లేకపోవడం, సరైన లైటింగ్ లేకపోవడం, హెచ్చరిక బోర్డుల కొరత, సర్వీస్ రోడ్లు, అండర్‌పాస్‌ల లేమి, వాహనదారుల నిర్లక్ష్యం వంటి అంశాలను ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు.


ప్రమాదాల నియంత్రణ కోసం నిరంతర డివైడర్ ఏర్పాటు, లైటింగ్, బ్లింకింగ్ సిగ్నల్స్, హెచ్చరిక బోర్డులు, సర్వీస్ రోడ్లు, అండర్‌పాస్‌లు, రహదారి భద్రతా ఆడిట్ నిర్వహణ వంటి పలు సూచనలు ఈ నివేదికలో పొందుపరిచారు.


ఈ నివేదిక ప్రతులను కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రోడ్లు భవనాల శాఖ మంత్రి బి.సి. జనార్ధన్ రెడ్డి, భారత వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఎ.పి. సింగ్, దక్షిణ వైమానిక దళ కమాండ్ ఎయిర్ మార్షల్ మనీష్ ఖన్నా, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ఛైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్, NHAI ‌ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ కార్యాలయ అధికారులు, NHAI ఒంగోలు ప్రాజెక్ట్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, గుంటూరు రేంజ్ డీఐజీ, ప్రకాశం జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, కొండపి ఎమ్మెల్యే డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, సింగరాయకొండ సర్కిల్ ఇన్‌స్పెక్టర్, సింగరాయకొండ స్టేషన్ హౌస్ ఆఫీసర్(SI), సింగరాయకొండ తహసీల్దార్, ఎంపీడీవో, జిల్లా రోడ్డు భద్రతా కమిటీ, రవాణా, రోడ్లు-భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి తదితర అధికారులకు పంపనున్నట్లు సాంబ చెన్నంశెట్టి తెలిపారు.


ప్రాణ నష్టాలను నివారించడం, ప్రజల భద్రతను కాపాడడం, రన్‌వేపై తక్షణ భద్రతా చర్యలు చేపట్టేలా ప్రభుత్వాలు, సంబంధిత శాఖలు స్పందించాలనే ఉద్దేశంతోనే ఈ సమగ్ర నివేదికను సిద్ధం చేసినట్లు ఆయన పేర్కొన్నారు.



No comments:

Post a Comment